top of page

శ్రీ సాయి దర్బార్ గురించి

1591977795835_IMG_20200611_104046.jpg

ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమంగా అద్దాల అలంకరణతో నిర్మించిన మందిరం శ్రీసాయి దర్బార్

                                           ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి అని నిరంతరం స్మరిస్తే శ్రీసాయి ఎల్లప్పుడూ మన చెంతనే ఉంటారు అని ఎన్నో నిదర్శనాలు మన కళ్ళముందు కనపడుతున్నాయి. మనరాష్ట్రంలోని నెల్లూరు పట్టణంలో బాలాజీ నగర్ చివరన గల పద్మావతి నగర్ లోని వేణుగోపాల స్వామి కళాశాల ఎదురుగా మొట్టమొదటిసారి షిర్డీలో సాయినాథుని మందిరం కొలతలతోనే శ్రీసాయి దర్బార్ నిర్మితమై దినదిన ప్రవర్థమానమవుతున్నది.

                                            ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నది మధ్యతరగతికి చెందిన ఒక సామాన్య భక్తులు. ఎవ్వరూ ఈనాడు కలలో కూడా ఊహించలేని అదృష్టం అతనికి దక్కింది. శ్రీసాయినాథునిపై గల అచంచల భక్తి విశ్వాసాలతో ముందడుగు వేసిన ఆ భక్తుని సంకల్పానికి సాటి భక్తులు తమ సహకారాన్ని అందించారు. ఒక అద్భుత మందిరం నిర్మాణం కావించి నిత్యపూజలు ఆరతులు, నిరంతరం సాయి భజనలు ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుత అద్దాల మందిరానికి భక్తులు శ్రీసాయి దర్బార్ అని నామకరణం చేశారు.2002 జూన్ 27న ఇంటిలో నిత్యం పూజలు అందుకుంటున్న బాబా విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి 5 రోజులు శ్రమదానంతో నిర్మించిన చిన్న మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటినుండి అనునిత్యం హారతులు, విష్ణు సహస్రనామం, అభిషేకాలు, భజనలు చేస్తూ వచ్చారు.అలా రెండు సంవత్సరాలు చేశారు. బాబాకు పెద్దమందిరం వినూత్నంగా నిర్మించాలనే సకల్పం మదిలో కలిగింది. సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ తమ సంకల్పాన్ని చీటిలలో రాసి బాబా పాదాల వద్ద ఉంచారు. అందులోంచి ఒక చీటీ తీసి చూడగా మందిర నిర్మాణానికి బాబా వద్దనుండి అనుమతి లభించింది. ఈ స్ఫూర్తితో శ్రీ సాయి దర్బార్ నిర్మాణానికి పునాది పడింది.మందిర నిర్మాణానికి నిధులు అంతగా లేకపోయినా అశేష భక్తుల సంకల్పంతో ముహూర్తం నిర్ణయించి కడప జిల్లా వాస్తవ్యులు సద్గురు దాస దివ్యహస్తాలతో 2004 మే 31న శంఖుస్థాపన చేశారు. శ్రీసాయి రాగం షిరిడీలోని సాయి నాధుని మందిరానికి తీసిపోని విధంగా నిర్మితమైంది మందిరానికి సంబంధించిన ప్లానుతో ఇంజనీరు బేల్దారి మేస్త్రీతో షిర్డీ వెళ్ళిన భక్తులు సంస్థాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో షిర్డీ సాయినాథ్ పీఠం, అరుగు, సమాధి కొలతలు తీసుకుని అవే కొలతలతో శ్రీసాయి దర్బారును నిర్మించారు. షిర్డీలో బాబా మందిరంలోని సమాధిలో బాబా దేహం ఉన్నది. ఇక్కడ 5 సంవత్సరాలపాటు భక్తుల స్వహస్తాలతో లిఖింపబడిన ఆరుకోట్ల సాయినామం నామకోటిగా నిక్షిప్తం చేయబడింది. సాయి నామానికి సాయికి భేదం లేదు. భగవన్నామానికి అపారమైన శక్తి ఉంది.

 

ధుని : షిర్డీలో వలె అఖండంగా వెలుగుతున్న ఈ ధుని యొక్క లీలా విశేషాలు

 

శ్రీసాయి దర్బార్ భక్తులు ధుని యాత్రగా బస్సు లో షిర్డీకి బయలుదేరి వెళ్ళారు.

 

బస్సు బయలుదేరింది మొదలు తిరిగి ఆలయానికి తిరిగి వచ్చేవరకు అఖండ నామజపం జరుగుతూనే ఉన్నది. షిర్డీలో ద్వారకామాయిలో నెలకొని ఉన్న ధుని నుండి అగ్ని కావాలని అడగక ముందే బాబా రూపంలో అక్కడి పూజారి ధునినుండి అగ్నిని తీసి ఇవ్వడం జరిగింది. ఈ లీలతో భక్తజనం పులకించిపోయారు. అదే ఆనందోత్సాహాలతో నామయజ్ఞం జరుగుతూండగా నెల్లూరు శ్రీసాయి దర్బారుకు చేరుకుని అగ్ని ఆరకుండా 2003 ఫిబ్రవరి 6వ తేది గురువారం వేద మంత్రోచ్ఛారణలతో శ్రీసాయి దర్బారులోని ధునిని ప్రారంభించడం జరిగింది. అది ఇంటికి అఖండంగా వెలుగుతూనే ఉన్నది.

 

అద్దాలతో అలంకరింపబడిన మందిరం : శ్రీ సాయి దర్బార్ అద్దాలతో చేసిన బాబా లీలలను తెలిపే దృశ్యాలు మనోహరంగా కనులను, మనసును మైమరపించే విధంగా మలచడం జరిగింది. అలాంటి చిత్రాలు షిర్డీలో తప్పమరెక్కడా కనిపించవు. అద్దాల అలంకరణకు అనేకమంది పనివారిని ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపించి సుదీర్ఘంగా 6 నెలల శ్రమతో అలంకరించారు.

 

ఇలాంటి అలంకరణతో నిర్మితమైన బాబా ఆలయం ఉందంటే అది శ్రీసాయి దర్బార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 

విగ్రహ ప్రతిష్ఠ : 2005 జూన్ 1వ తేదీన జైపూర్ నుంచి తెచ్చిన సాయినాథుని విగ్రహమూర్తిని అత్యంత వైభవంగా సద్గురు దర్గాస్వామి దివ్యహస్తాలతో ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీసాయినాథుని విగ్రహమూర్తి అనిర్వచనీయమైన దివ్య సౌందర్యంతో, తేజస్సుతో, సజీవంగా భక్తులను పలకరించి అనుగ్రహించడానికే అన్నట్లు చిరుదరహాసంతో శ్రీసాయి దర్బార్ లో కొలువై ఉన్నారు.

 

శ్రీసాయి దర్బార్ ప్రత్యేకతలు : ప్రతినిత్యం భజనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, సచ్చరిత్ర పారాయణ జరుగుతాయి. ప్రతి మంగళవారం శ్రీసాయి సచ్చరిత్ర సంపూర్ణంగా పారాయణం జరుగుతుంది.

 

షిర్డీ సంస్థాన్ సాంప్రదాయం ప్రకారం నాలుగు వేళలా ఆరతులు, ఉదయం క్షీరాభిషేకం నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతో నిత్యం అన్నదానం జరుగుతున్నది. షిర్డీలో జరిగే విధంగానే పర్వదినాలు కూడా జరపబడుతున్నాయి

 

నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి, శ్రీ దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, శివరాత్రి, దీపావళి, వినాయకచవితి వంటి పర్వదినాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి

 

ఇవేకాక భక్తుల నివాసాల్లో 2000 సంవత్సరం ఫిబ్రవరి 24న ప్రారంభించబడిన భజనలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సాయి తత్వంపై సత్సంగాలు నిర్వహిస్తున్నారు. శ్రీసాయి దర్బార్ పైభాగంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. ఇంకా ఈ మందిర ప్రాంగణంలో విఘ్న గణపతి శ్రీ ఆంజనేయస్వామి, దత్తాత్రేయుడు, సంతానాన్ని ప్రసాదించే అశ్వత్థ వృక్షం మొదలైనవి ఉన్నాయి. శ్రీసాయి దర్బార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తులు సాయినామ సంకీర్తనతో షిర్డీ యాత్రను కొనసాగించడం జరుగుతుంది

 

ఇంతటి మహత్తరమైన బాబా మందిరాన్ని దర్శించాలంటే వేయి కళ్ళు చాలవు అన్నట్లుంటుంది. ఎటు చూసినా బాబా రూపం దర్శనమిస్తూ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నట్లు గోచరిస్తుంది. ఈ మందిరాన్ని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా చూచి తరించాల్సిందే.

 

                                                                               "దైవ శక్తిని తెలుసుకోవటానికి గురుభక్తి ఎంతో అవసరము"

శ్రీ సాయిర్బార్

అద్దాల మందిరము

బాలాజీ నగర్ ఎక్స్‌టెన్షన్, పద్మావతి నగర్, నెల్లూరు -524002, ఆంధ్రప్రదేశ్ | srisaidarbar@gmail.com

©2023 by Sri Sai Darbar

bottom of page